పారిశుద్ద్య కార్మికుల సమ్మెతో హైదరాబాద్ దుర్గంధం
హైదరాబాద్,జులై 9 (జనంసాక్షి):
తెలంగాణలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలం కావడంతో.. కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అయితే ప్రభుత్వం సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తుందో.. ఎలా పరిష్కరిస్తుందో చెప్పడం లేదని కార్మిక సంఘ నేతలంటున్నారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నాలుగోరోజుకు చేరడంతో వీధులు, రహదారులు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని… వెంటనే విధుల్లో చేరాలని సర్కారు కోరుతుండగా… కార్మికులు మాత్రం మెట్టు దిగడం లేదు. తమ డిమాండ్ల పరిష్కారానికి స్పష్టమైన హావిూ లభించే వరకు సమ్మె ఉపసంహరించే పసక్తే లేదని భీష్మిస్తున్నారు. మరో వైపు రాష్ట్ర రాజధానిలో వీధులు శుభ్రమయ్యేలా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్‌లో చెత్త పేరుకు పోవడంపై న్యాయవాది రాజేశ్వరి పిల్ దాఖలు చేశారు. కార్మికుల జీతాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని.. అయితే కొంత సమయం కావాలని కోరినట్లు కార్మిక శాఖమంత్రి నాయిని
తెలిపారు. కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఒకవేళ విధుల్లో చేరకపోతే ప్రభుత్వం తమ పని తాము చేస్తామన్నారు.సమ్మె కారణంగా తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు హైదరాబాద్‌లోనూ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో.. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఆయా ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. సమ్మెలో భాగంగా కార్మికులు జోనల్ కార్యాలయాలను ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని.. అవసరమైతే మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సమ్మె విరమించాలని తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కల్పించుకొని మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ దుర్గంధంగా మారడం ఖాయమని పలువురంటున్నారు.