పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు
గరీబోళ్లకు ఇండ్లు కట్టిస్తామంటే గంత ఓర్వలేనితనమా?
యూనివర్సిటీ భూములపై వెనక్కు తగ్గేదిలేదు..సీఎం కేసీఆర్
హైదరాబాద్,మే19(జనంసాక్షి): పారిశుద్ధ్య కార్మికులకు కడుపు నిండేలా జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతేకాక ఇండ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సఫాయి కర్మచారీలు తల్లిదండ్రులతో సమానమని అన్నారు. ఇక మరోవైపు గరీబోళ్లకు ఇళ్లు కట్టిస్తానంటే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల స్థలాలు అభివృద్ధికి తీసుకోవడంపై చెలరేగిన వివాదంపై ఆయన స్పందించారు. తన నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. పేదలకు ఇళ్లు కడతానంటే తన దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు కద్దవంటారా? అని ప్రశ్నించారు. పేదల జీవితాల్లో మార్పు రావడం కొందరికి ఇష్టం లేదని… దిష్టిబొమ్మలు తగలబెడుతున్న వారిని కొందరు నేతలు భుజానికి ఎత్తుకుంటున్నారన్నారు.పేదలకు న్యాయం చేసే విషయంలో వెనక్కిపోయేది లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం పేదలను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు తన నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు సిఎం బౌద్దనగర్ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్లపై తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. యూనివర్సిటీ స్థలాన్ని అభివృద్ధి కోసం తీసుకునే అంశంపై ఆందోళనల నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ విషయమై సీఎం మాట్లాడుతూ పేదలకు ఇళ్లు కడతానంటే కొందరు తన దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారన్నారు. పేదల జీవితాల్లో మార్పులు రావడం వారికిష్టం లేదని తెలిపారు. దిష్టిబొమ్మలు కాలబెట్టేవాళ్లను కొందరు నేతలు భుజానికెత్తుకుంటున్నారని మండిపడ్డారు.ఇది రాజుల కాలం కాదని..యూనివర్సిటీలకు వేల ఎకరాలు అవసరం లేదని పేర్కొన్నారు. ఉద్యానవర్సిటీకి 50 ఎకరాలు సరిపోతాయని ప్రధానికి చెప్పానన్నారు. గరిబోళ్లకు ఇళ్లు కట్టిస్తానంటే చిల్లర రాజకీయాలు చేస్తున్నరని మండిపడ్డారు. పేదలకు న్యాయం చేసే విషయంలో వెనక్కి పోనని.. నిరుపేదలకు దశలవారీగా ఇళ్లు కట్టించి తీరుతానని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ భూములను ఖచ్చితంగా ఉపయోగించుకుంటమని స్పష్టం చేశారు. ఒక పని మొదలుపెడితే మధ్యలో ఆపే ప్రసక్తే లేదని వెల్లడించారు. విశ్వవిద్యాలయాలకు వేలాది ఎకరాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను మొండివాడినని, అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని చెప్పారు. ఓయూలో కొంత స్థలం తీసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో రేసు కోర్సులకు గోల్ఫ్, పేకాట క్లబ్బులకు వందల ఎకరాలు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టడం తప్పా అని ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేసే విషయంలో తాను ఎవరినీ భయపడనని కేసీఆర్ స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ బౌద్ధనగర్ దగ్గర పలువురు ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. బౌద్ధనగర్‌కు రానున్న కేసీఆర్ ఎదుట నిరసన తెలిపేందుకు వీరు రాగా పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. ఓయూకు చెందిన పలువురు విద్యార్థులు కెసిఆర్ ముందు నిరసన తెలిపేందుకు నిర్ణయించి వెళ్లారు. ఓయూ భూములపై ప్రకటనకు వారు నిరసన తెలపాలనుకున్నారు.