పారిశుద్య పనులు సకాలంలో చేపట్టాలి
వరదప్రభావిత గ్రామాల్లో వ్యాధులు రాకుండా చర్యలు
నిజామాబాద్,జూలై19(జనం సాక్షి): ప్రతీ నివాస ప్రాంతంలో పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీ జరిగితే వెంటనే సరిచేయాలని సూచించారు. ఒక్కోట్యాంకు వారీగా ట్యాంకులను శుభ్రం చేయించాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా వారిని బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే రిపేర్ చేయించి విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్‌లకు సంబంధించి దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల మరమ్మతులు రెండు, మూడు రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కాల్వల వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.