పారిస్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
పారిస్ : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన ఆయనకి అక్కడి అధికారులు సాదర స్వాగతం పలికారు. తన తొమ్మిది రోజుల విదేశీ యాత్రలో భాగంగా మోదీ తొలుత ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు. నాలుగురోజుల పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతోపాటు అక్కడి వ్యాపార వర్గాలతో మోదీ భేటీ అవుతారు. పౌర అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో ఆ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది.
ఈ పర్యటనలో మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని కొత్త పుంతలు తొక్కించాలని భావిస్తున్నారు. ఒబామా భారత పర్యటనలో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించినట్లే ఫ్రాన్స్‌లో ‘నావ్ పే’ చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోదీ, హోలాండేలిద్దరూ కలసి పడవలో ప్రయాణిస్తూ సమాలోచనలు జరపనున్నారు. అక్కడి మొదటి ప్రపంచ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, అప్పట్లో ఫ్రాన్స్ తరఫున పోరాడి అమరులైన పది వేల మంది భారత సైనికులకు నివాళులర్పించనున్నారు. యునెస్కో ప్రధాన కార్యాలయం, ఎయిర్‌బస్ కంపెనీ, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీలనూ మోదీ సందర్శిస్తారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ జర్మనీ, ఆతర్వాత కెనడాలో పర్యటనకు వెళతారు.