పారిస్ లో బరితెగించిన ఉగ్రవాదం

ouvpckolహైదరాబాద్ : ఉగ్రవాదం బరితెగించింది. టెర్రరిజం తెగబడింది. ఉన్మాదం తలకెక్కిన ఐఎస్‌ఐఎస్‌ ప్యారిస్‌ నగరంలో నరమేధం సాగించింది. ఫ్యాషన్‌ నగరం ప్యారిస్‌పై విషం కక్కింది. వందలాది అమాయక ప్రజలను చుట్టుముట్టి కాల్చి చంపేసింది. నరనరాన విద్వేష విషాన్ని నింపుకున్న ఉగ్రవాదులు బుల్లెట్ల జడివాన కురిపించారు. బాంబులు పేల్చి ప్యారిస్‌ వాసులను పొట్టన పెట్టుకున్నారు. కేవలం ఏడుగురు ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గన్‌లు ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం…..

బట్లకాన్‌ హాలులోకి వందలాదిమందిని తీసుకెళ్లి బంధించారు. నిర్దాక్షిణ్యంగా వారిపై గన్‌లు ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. నాలుగుగోడల మధ్య వారిని కాల్చి చంపేశారు. తుపాకీ గుండ్ల జడివానలో రక్తంతో తడిసి ముద్దయిన వందమంది అమాయకులు ప్రాణాలు విడిచిపెట్టారు.

జాతీయ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌….

ఫ్రాన్స్‌ జాతీయ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఒక్కసారిగా బాంబు పేలింది. జనమంతా ఒక్కసారి గ్యాలరీలు వదిలి గ్రౌండ్‌లోకి పరుగులు పెట్టారు. అదే స్టేడియంలో మ్యాచ్‌ చూస్తున్న అధ్యక్షుడు హోలాండ్‌ను భద్రతాధికారులు వెంటనే సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిపోయారు.

బాంబులు పేల్చి, కాల్పులు జరిపి….

ఒక షాపింగ్‌ మాల్‌, ఒక రెస్టారెంట్‌లలోనూ బాంబులు పేల్చిన ఉగ్రవాదులు.. కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. బాంబు పేలుళ్లు, కాల్పుల్లో 70 మంది చనిపోయినట్లు.. సమాచారం. బటక్లాన్‌ థియేటర్‌లో వందమంది చనిపోయారు. ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్‌ కాసేపటికే తేరుకుని.. ఎదురుదాడికి దిగింది. సుశిక్షితులైన భద్రతాదళాలు ప్యారిస్‌ నగరాన్ని జల్లెడ పట్టాయి. వేటాడి వెంటాడి ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపేశారు. సరిహద్దులను సైతం మూసివేసి.. గాలింపు కొనసాగిస్తున్నారు.

అంధకారంలో ఈఫిల్‌ టవర్‌……

ఎప్పుడూ లైట్లతో ధగధగలాడే ఈఫిల్‌ టవర్‌ ఒక్కసారిగా చీకట్లో కలిసిపోయింది. ఉగ్రదాడిలో చనిపోయినవారికి నివాళులు అర్పిస్తూ ఈఫిల్‌ టవర్‌ లైట్లు మొత్తాన్ని ఒక్కసారిగా ఆపేశారు. దీంతో ఈఫిల్‌ టవర్‌ విషాదానికి గుర్తుగా అంధకారంలో ఉండిపోయింది.