పార్టీ అధిష్టానానిదే రాజీనామా నిర్ణయం-రాజీవ్‌ ప్రతాప్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం తన నిర్ణయం కాదని రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అన్నారు. అది పార్టీ నిర్ణయమని ఆయన తెలిపారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాను పాటిస్తున్నానని చెప్పారు. తనను పదవి నుంచి ఎందుకు తప్పుకోమన్నారో తెలియదన్నారు. అయితే పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం నాకు సంతోషంగా ఉందని రూడీ తెలిపారు. ఇక పార్టీలో కీలక పదవి అప్పగిస్తారన్న అంశంపై రూడీ స్పందిస్తూ చూద్దాం అన్నట్లు సమాధానమిచ్చారు. ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరిస్తుండటంతో కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. కేబినెట్‌లోకి కొత్త మంత్రులను తీసుకురానున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ సహా ఉమాభారతి, సంజీవ్‌ బల్యాన్‌ రాజీనామా చేశారు. మరి కొందరు కేంద్ర మంత్రులు కల్‌రాజ్‌ మిశ్రా, ఫగ్గన్‌సింగ్‌ కులస్థే, మహేంద్ర పాండే కూడా రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఇక కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కూడా పదవి నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది.