పార్టీ మారిన తలసాని.. ముందు ఎన్నికల్లో గెలువు!
– తర్వగా విమర్శిద్దువుగానీ..!
– షబ్బీర్ అలీ హితవు
హైదరాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి):
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిరికిపంద అని మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ అన్నారు. ఒక పార్టీపై గెలిచి ఇంకో పార్టీలో మంత్రిగా కొనసాగడం తలసానికే చెల్లిందని ఆయన ఎద్దేవాచేశారు. చట్టాలను ఉల్లంఘించిన తలసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తలసానికి దమ్ముంటే రాజనామా చేసి ఎన్నికల్లో గెలవాలని ఆయన సవాల్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి భజన చెయ్యవని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాయని షబ్బీర్ అలీ తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసానికి దమ్ముంటే తమను జైల్లో పెట్టాలని షబ్బీర్ అలీ సవాల్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డొస్తే జైల్లో పెడతామన్న మంత్రి తలసాని వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడితే తమను జైలుకు పంపుతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షాలను విమర్శించేందుకు తలసాని, తుమ్మల, మహేందర్‌రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహులే దొరికారా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తలసాని మంత్రి పదవికి రాజీనామా చేసి వస్తే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్తామని షబ్బీర్ అలీ అన్నారు. ఇదిలావుంటే తలసాని విషయంలో గవర్నర్ టిఆర్‌ఎస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఆయన రాజీనామా చేసినా ఎందుకు ఆమోదించన్నారు. టిడిపిలో గెలిచిన తలసానిని ఎలా మంత్రిగా కొనసాగిస్తారో గవర్నర్ చెప్పాలన్నారు. సనత్‌నగర్‌లో గెలిచే ధైర్యం లేకనే తలసాని రాజీనామాపై వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికారం అడ్డం పెట్టుకుని ఆగడాలు చేసేందుకే తలసాని మంత్రిగా ఉన్నారని అన్నారు. ఇదిలావుంటే నగరంలో అనేక ఓట్లను తొలగించారన్నారు. తన నియోజకవర్గంలో కూడా ఓట్ల తొలగింపు దారుణమని, ఇప్పుడు తన ఓటు కూడా ఉందో లేదో తెలియదన్నారు. ఇదిలావుంటే చీప్‌లిక్కర్‌పై రహస్య ఎజెండా ఏమిటో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సీఎం తెలంగాణలోని ప్రజలను మద్యం మత్తులో ఉంచి, రాష్ట్రాన్ని దోచుకోవాలని కుట్ర చేస్తున్నాడని పొంగులేటి ఆరోపించారు. చీప్‌లిక్కర్‌పై కేసీఆర్ పునరాలోచించాలని ఆయన కోరారు. తలసాని అధికార మత్తులో మాట్లాడుతున్నారని, మంత్రులను సీఎం కేసీఆర్ అదుపులో పెట్టాలని పొంగులేటి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ నేత శ్రవణ్ ఆరోపించారు.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడం లేదని మండిపడ్డారు. విద్యారంగంలో మతాన్ని జొప్పించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో నూతన విధానాలపై రేపు(శనివారం) గాంధీభవన్‌లో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత శ్రవణ్ తెలిపారు.