పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థ రద్దు

6

హైదరాబాద్‌ : పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని ఉపసంహరించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది. రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం సరికాదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్ల సందర్భంగా ఉన్నత న్యాయస్థానం మే 1న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. అయితే న్యాయస్థానం ఉత్వర్వులు జారీచేసినప్పటికీ పార్లమెంటరీ కార్యదర్శుల ¬దాను అనుభవిస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోర్టులో ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ శుక్రవారం న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని ఉపసంహరించడంతో పాటు వారికి ఎలాంటి ¬దా కల్పించడం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఇప్పటికే శ్రీముఖం సైతం జారీ చేసింది.