పార్లమెంటును కుదిపేసిన భగవత్ ‘వీడియో’ వివాదం..

న్యూఢిల్లీ : పార్లమెంట్ లో వీడియో చిత్రీకరణ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ ఎంపీ భగవత్ మాన్ ను తీవ్రంగా తప్పుబట్టాయి అధికార బీజేపీ, అకాలీదళ్ పార్టీ వర్గాలు. పార్లమెంట్ కార్యకలాపాలను చిత్రీకరించిన వీడియోను ఎంపీ భగవంత్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో దీనిపై వివాదం మరింతగా రగులుతోంది. దీంతో భగవత్ మాన్ సభా హక్కులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పట్టుబట్టారు బీజేపీ నేతలు. వీడియో వ్యవహారం ఉభయ సభలను కుదిపేయడంతో ఉభయ సభల సభా వ్యవహారాలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. వీడియో వ్యవహారంపై ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్.. భగవంత్ చిత్రీకరించిన వీడియో ఒకవేళ ఉగ్రవాదుల చేతిలోకి వెళితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. పార్లమెంట్ కార్యకలాపాలను చిత్రీకరించడం తీవ్రంగా తప్పుబట్టిన కేంద్రమంత్రులు దీని వెనుక అసలు ఉద్దేశమేంటో విచారణ ద్వారా తేల్చాలని డిమాండ్ చేశారు.
ఇక ఇదే విషయంపై స్పందించిన మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మరోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే వీడియో చిత్రీకరణపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు ఎంపీ భగవత్. తాను పార్లమెంటు భద్రతకు భంగం కలిగించే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడలేదని, కేవలం జీరో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే వీడియో తీశానని వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల సమయంలో జరిగే చర్చలు కాస్త లక్కీ డ్రా తరహాలో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.