పార్లమెంటు సభాపర్వం

– అన్ని అంశాలపై చర్చిస్తాం
– ప్రధాని మోదీ
దిల్లీ,నవంబర్‌ 17(జనంసాక్షి): రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు . ఈ రోజు పార్లమెంటు లైబ్రరీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే .జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని .. సభకు | హాజరయ్యే అవకాశం కల్పించాలని ప్రతిపక్షాలు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశాయి. అలాగే ఆర్థిక మందగమనం, నిరుద్యోగిత పెరుగుదల, రైతాంగ సంక్షోభంపై విస్తృత చర్చ జరపాలని కాంగ్రెస్‌ లోకసభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి కోరారు . ఈసారి కూడా సభ అత్యంత సమర్థంగా సాగాలని మోదీ ఆకాంక్షించారు . సభా నియమ, నిబంధనల ప్రకారం అన్ని రకాల అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిర్మాణాత్మక చర్చలు జరిగితేనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని వ్యాఖ్యానించారు . ఈ సమావేశానికి మొత్తం 27 పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు . తెలుగురాష్ట్రాల నుంచి తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, తెదేపా నుంచి గల్లా జయదేవ్‌, వైకాపా నుంచి విజయసాయిరెడ్డి హాజరయ్యారు .
ఎన్డీయే భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు
స్వల్ప విభేదాలున్నా దేశ ప్రయోజనాల కోసం సమిష్టిగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే భాగస్వామ్య  పక్షాలను కోరారు. మహారాష్ట్ర రాజకీయాలతో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు.మనది విశాల కుటుంబమని ప్రజల కోసం సమిష్టిగా పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ భాగస్వామ్య పక్షాలను కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో ఎన్డీయేకు పట్టం కట్టారని గుర్తుచేశారు.మహారాష్ట్రలో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో స్వల్ప విభేదాలు, వైరుధ్యాలు ఎన్డీయేను బలహీనపరచలేవని మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్డీయే భేటీ సానుకూలంగా జరిగిందని, తమ కూటమి దేశంలోని వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అద్దంపడుతుందని సమావేశానంతరం ప్రధాని ట్వీట్‌ చేశారు. రైతులు, యువత, మహిళలు, నిరుపేదల జీవితాల్లో గుణాత్మక మార్పు సాధించేవరకూ తాము ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోమని వ్యాఖ్యానించారు.కాగా, శివసేన కీలక ఎన్డీయే భేటీకి హాజరుకాకపోవడం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇక బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలకు పార్టీ సభ్యుల హాజరు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. సభలో కీలక అంశాలను లేవనెత్తాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు.