పార్లమెంట్‌లో హోరెత్తిన నిరసనలు

5

– రెండో రోజు అదేతీరు

– మంత్రుల రాజీనామాకు విపక్షాల డిమాండ్‌

న్యూఢిల్లీ,జులై22(జనంసాక్షి):

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు    నిరసనలు హోరెత్తి , వాయిదాల పర్వం కొనసాగింది. వ్యాపం, సుష్మా, వసుంధరల రాజీనామాపై సభ్యులు  పట్టుబ్టటారు.  తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట మృతులకు సభ సంతాపం తెలిపింది. గోదావరి పుష్కరాల ప్రారంభం రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో14వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో 27మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలు అడ్డుకోవడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గంటపాటు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్‌సభను మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు. ఈ లోగా పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ప్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్‌ సుమిత్రా మమాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అనుమతించమని, వెంటనే ఎవరికి వారు తమ సీట్లలో కూర్చోవాలన్నారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ వీసా వివాదంపై చర్చ జరగాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మెన్‌ కురియన్‌ సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభయ్యాక కూడా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత ప్రారంభమైన కొద్ది క్షణాలకే ప్రతిపక్ష సభ్యులు సభలో కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ చైర్మెన్‌ హమిద్‌ అన్సారీ అరగంటపాటు వాయిదా వేశారు. మొత్తానికి లలిత్‌మోడీ, వ్యాపం కుంభకోణంపై పార్లమెంట్‌  దద్ధరిల్లిపోతోంది. నిన్న వాయిదాల పర్వంతోనే ముగిసిన సభ నేడు కూడా అదే రీతి కొనసాగుతోంది. ఇప్పటికే సభ రెండు సార్లు వాయిదా పడింది. సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజేపై కేంద్రం చర్యలు తీసుకోవాలని బిఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. వ్యాపం మరణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. మధ్యప్రదేశ్‌లో శాంతి భద్రతల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. వ్యాపం స్కాం మరణాలకు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. వ్యాపం స్కామ్‌ పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. మద్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌ ఈ కుంభకోణానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపిలు ఉభయ సభలలో ఆందోళనకు దిగారు. వీరు చేతులకు నల్లబడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు.వీరి ఆందోళన కారణంగా లోక్‌ సభ వాయిదా పడింది. రాజ్యసభలో సైతం ఇదేసీన్‌ ఏర్పడడంతో అక్కడ కూడా వాయిదా పడింది.మద్యప్రదేశ్‌ లో ఉద్యోగాలు, వృత్తి విద్యా కోర్సులలో సీట్ల ఎంపికలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం ఒక ఎత్తు అయితే, ఈ కేసుకు సంబందించి నలభై ఎనిమిది మంది మరణించడం అనుమానాస్పద స్థితిలో మరణించడం మరో ఎత్తుగా ఉందని ఎంపిలు ఆరోపించారు.