పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారుల కసరత్తు

ఉద్యోగుల నియామకాలపై ఆరా
హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అసెంబ్లీ,గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియడంతో దేశ వ్యాప్తంగా జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈవీఎంల మొదటి దశ తనిఖీ పక్రియ పూర్తయింది. ఈ నెల 22న ఓటరు తుది జాబితా వెలువడ నుంది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ పక్రియలను పూర్తి చేస్తున్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా గత ఏడాది డిసెంబర్‌ 26 నుంచి ఈ నెల 4 వరకు కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఎన్నికల్లో కీలకమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పొందు పరుస్తున్నారు. ఈ నెల 22 వరకు తుదిజాబితాను సిద్ధం చేయనున్నారు. ఓటరుగా నమోదు చేసుకొనేందుకు నామినేషన్ల చివరి రోజు వరకు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. గ్రామాల్లో ఓటింగ్‌ శాతం పెంచడంతో పాటు ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయో గించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు, కంట్రోల్‌ యూనిట్‌లను పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఉపయోగించ నున్నారు. ఈ పక్రియను ప్రారంభించిన అధికారులు ఈవీఎంల మొదటి విడత తనిఖీలు పూర్తి చేశారు. జాయింట్‌ కలెక్టర్‌, ఇతర అధికారులు ఈవీఎంల తనిఖీలను పకడ్బందీగా నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాలను తొలగించుకొనేందుకు నమూనా పోలింగ్‌ సైతం పూర్తి చేశారు. కొన్ని రోజుల తర్వాత మరోసారి తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ నిర్వహణకు జిల్లాలో పనిచేసే ఉద్యోగులు సరిపోగా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం విధులు నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు, సిబ్చంది, ఉపాధ్యాయుల వివరాలను సేకరిస్తున్నారు.