పార్లమెంట్ సమావేశాల ఎజెండా ప్రకటించండి
` ఏకపక్షంగా సమావేశాలు ఎలా నిర్వహిస్తారు?
` మోదీకి సోనియా సూటి ప్రశ్న
న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అజెండా ఏమిటో చెప్పకుండా సమావేశాలు నిర్వహించడంపై ఆమె ప్రశ్నించారు. తాము అనేక ప్రజా సమస్యలపై చర్చించాలని అనుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏ చర్చలు జరుగుతాయో చెప్పాలని ప్రధానికి రాసిన లేఖలో సోనియా కోరారు. ఇతర పార్టీలతో ఏ మాత్రం చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. అసలు ఎందుకు ఈ సమావేశాలు పెడుతున్నారో స్పష్టత లేదని అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ మిగతా పార్టీలకు ఓ మాట కూడా చెప్పకుండానే వీటిని ఏర్పాటు చేశారు. మాలో ఎవరికి కూడా ఈ సమావేశాల అజెండా ఏంటో స్పష్టత లేదు. కీలక అంశాలపై చర్చించేందుకు మాకు సమయం కేటాయి స్తారనే ఆశిస్తున్నామని సోనియా గాంధీ తెలిపారు. ఇదే లేఖలో మొత్తం 9 అంశాలను సోనియా ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం,నిరుద్యోగం సమస్యలపై మాట్లాడేందుకు సమయం కేటాయించాలని కోరారు. వీటితో పాటు మరో 8 అంశాలను పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలి. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగతం, చిన్న మధ్య తరహా పరిశ్రమలపై ఒత్తిడి పెరగడం లాంటి అంశాలపై చర్చించేందుకు అవకాశమివ్వాలన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చిన హావిూలు, కనీస మద్దతు ధర విషయంలో రైతు సంఘాలకు ఇచ్చిన హావిూలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. మణిపూర్ అల్లర్లపై చర్చించడంతో పాటు,ఆ సమస్యకు పరిష్కారం చూపించడం,శాంతియుత వాతావరణం నెలకొల్పడంపై చర్చ జరగాలన్నారు. హరియాణా సహా పలు రాష్టాల్ల్రో అశాంతిని తగ్గించేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాధానం చెప్పాలని కోరారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. కులగణన చేపట్టాల్సిన అవసరంపై చర్చ జరగాలని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండేలా చూడాలి. ఈ మధ్య కాలంలో భారీ విపత్తులతో అల్లకల్లలోమైన రాష్టాల్ర పరిస్థితిపైనా చర్చ జరగాలి. ప్రజా సమస్యలకే ప్రాధాన్యతనిస్తూ సమావేశాల్లో తాము చర్చకు సిద్ధమవుతామని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం తమకు సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడిరచారు. ఈ అంశాలన్నింటినీ చర్చించేందుకు సమయం కేటాయించాలని అన్నారు. అలాగే ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదించ కుండానే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణయించారని దుయ్యబట్టారు. ఈ సమావేశాల ఎజెండా గురించి ప్రతిపక్షాలకు తెలియడం లేదన్నారు.