పాలనా వికేంద్రీకరణకు విజయాభవ!
దసరా ముహూర్తం మంచిదన్న భావన ఆచారంగా వస్తోంది. దసరా రోజు ఏ పని మొదలు పెట్టినా విజయం అవుతుందన్న నమ్మిక. అందుకే అది విజయదశమి అయ్యింది. విజయదశమి రోజు ముహూర్తం చూడకుండా పని మొదలు పెడతారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేడా మరో బృహత్తర కార్యక్రమానికి దసరాను ముహూర్తంగా పెట్టుకుంది. కొత్తగా జిల్లాలు, మండలాలను ఆనాటికల్లా రూపొందించుకుని దసరా రోజు ప్రారంభించేందుకు రంగం సిద్దం చేశారు. సిఎం కెసిఆర్ ఏ పని తలపెట్టినా పక్కాగా చేస్తారు. చేయాలనుకున్న సమయానికి చేస్తారు. తెలంగాణ పదిజిల్లాలను విభజించాలన్న సంకల్పం తెలంగాణ ఉద్యమ కాలం నుంచే ఉంది. దీనిని కనీసం 25 జిల్లాలు చేయాలన్న ఆలోచన మేరకు కార్యాచరణ చేస్తూ వచ్చారు. ప్రజల నుంచి, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న సూచనలు, సలహాల మేరకు పాలనను ప్రజలకు చేరువ చేసే సదుద్దేశ్యంతో ఈ విభజన ప్రక్రియను ముందుకు తసీఉకుని వెళుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన పక్రియను కేవలం జిల్లాల విభజనే కాదని, మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసి, అందుకు అనుగుణంగా కార్యాచరణ చేయాలని సూచించారు. పరిపాలనా సౌలభ్యం ప్రజల సౌకర్యం ప్రధాన లక్ష్యంగా చేపట్టిన జిల్లాల, మండలాల పునర్విభజన క్రమంలో కొనసాగుతున్న కసరత్తు, పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రణాళిక రూపుదిద్దుకున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చేలా కార్యాచరణకు రంగం సిద్ధమయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజాభి ప్రాయానికి పెద్ద పీటవేయాలని, అదే సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగవద్దని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పాలనాపరంగా వెసలుబాటు ఉండాలన్న సదాశయం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఎక్కడో సుదూరంగా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి రావడంలో ఉన్న ఇబ్బందులను తొలగించి కనీసంగా 70 కిలోవిూటర్ల పరిధిలోనే మొత్తం జిల్లా ఉండేలా ప్రణాళిక చేయడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవాలి. మొత్తంగా సుమారు 50 నుంచి 60వేల జనాభా ఉండే ఒక మండలం ఏర్పాటు, సుమారు 20మండలాలతో జిల్లా ఏర్పాటు, సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్ మండలాల ఏర్పాటు, ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక అసెంబ్లీ సెగ్మెటుకు 5 నుంచి 6 మండలాలు ఉండే విధంగా కసరత్తు చేయనున్నారు. ప్రజల అవసరాలు సెంటిమెంట్లను సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకోవాలి. దీనికంతటికీ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందించడమే ప్రభుత్వం విూదున్న బాధ్యతని సిఎం తన సంకల్పాన్ని వివరించారు. తమను ఇతర మండలాల్లో బలవంతంగా కలిపారన్న భావన ప్రజలకు రానీయకుండా మండలాల రూపకల్పనలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఒక్క జిల్లాలే కాదు.. మండలాలను కూడా పునర్విభజిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రచించాలని దిశానిర్దేశం చేశారు. గత కలెక్టర్ల సమా వేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కార్యాచరణ ఎంత వరకు వచ్చిందో చర్చించిన సిఉం కెసిఆర్ ఇక దసరాను డెడ్‌లైన్‌గా పెట్టారు. పెరుగుతన్న అవసరాలు, పాలనాపరంగా సౌలభ్యం అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు విభజన ప్రక్రియ ముందుకు సాగడం ముదావహం. అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో వుంచుకుని పాలనా ఫలాలు ప్రజలకు క్షేత్రస్థాయిలోకి చేరుకునేలా ప్రణాళికలు రచించడంలో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నారు. పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేయాలన్న బలమైన సంకల్పం కూడా దీనికి ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ప్రజలకు కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటే నిజంగానే వారి సమస్యలను వివరించేందుకు అవకాశం ఉంటుంది. నేరుగా అధికారులను కలుసుకునే వీలు కలుగుతుంది. ఇలా పాలన చేరువగా వచ్చినప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన అందులో భాగమేనని సీఎం పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తాగునీరు, సాగునీరు పునరుద్దరనే లక్ష్యంగా కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడు మరింత విస్తృతంగా పనులకు సిఎం కెసిఆర్ సంకల్పించారు.
ఈ పనులను నేరుగా సకాలంలో ప్రజలకు చేర్చాలంటే అందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేయాల్సి ఉంటుంది. తాగునీరు, సాగునీరు విూద యుద్దం అయిపోతే తర్వాత పేదరికం కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో ఇబీసీల్లో ఉన్న ఒక్కొక్క పేద కుటుంబాన్ని టార్గెట్ చేసి అభివృద్ధి చేయాలన్నది సిఎం కెసిఆర్ లక్ష్యంగా ఉంది. ఇప్పుడున్న 10 జిల్లాల యంత్రాంగంతో దీనిని సాధించడం అంత సులువు కాదు. పెన్షన్లు, రేషన్, శాంతిభద్రతలు, అభివృద్ది పనులు ఇలా అన్నీ గ్రామాలకు చేరాలంటే సైన్యం కావాలి. ఆ సైన్యాన్ని సవిూకరంఇచుకుని సన్నద్దం చేయడంలో భాగంగానే విభజన ప్రక్రియకు వేగం పెంచారు. దసరానాటికి కసరత్తు పూర్తి చేసి ముందుకు సాగేలా చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఏకపక్షంగా ఉండరాదన్నది కూడా సిఎం కెసిఆర్ ఉద్దేశ్యంగా ఉంది. అందుకే విూరు విూ కసరత్తు పూర్తి చేయండి…మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కూర్చొని చర్చించండి. ఓ ఐడియాకు రండి. ఆ తర్వాత అభ్యంతరాల కోసం ప్రజా ప్రకటన ఇద్దాం. ఆ తర్వాత చివరిగా నోటిఫికేషన్ జారీ చేద్దాం అని కూడా సూచించారు. కాబట్టి విస్తృత ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల, మండలాలు ఏర్పాటు కానున్నాయి.