పాలమూరు – దిండి అపెక్స్ కమిటీకి
– సుప్రీం నిర్ణయం
– సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ రెండు ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రమంత్రి ఉమాభారతి చైర్‌పర్సన్, ఇతర రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ పాలమూరు, డిండి సమైక్య రాష్ట్రంలో ఆమోదించిన ప్రాజెక్టులేనని వాదించారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు విభజన తర్వాతే ప్రారంభించారని, ఇప్పటివరకు సర్వే చేపట్టలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఇరు రాష్ట్రాలు నూతన ప్రాజెక్టులు చేపట్టరాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పాలమూరు, డిండి డీపీఆర్‌లను ఇంతవరకు సమర్పించలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సెగ రాజేస్తున్న ప్రాజెక్టుల నిర్మాణంపై సుప్రీం కోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై కృష్ణా జిల్లా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి తెహర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించి పలు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది. కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండకూడదని తేల్చింది.ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులే ఇప్పుడు నిర్మిస్తున్నామన్న తెలంగాణ వాదనతో ఏపీ పూర్తిగా విభేదించింది. అప్పట్లో కిరణ్‌కుమార్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్వే చేయాలని మాత్రమే ఆదేశించిందని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా రంగంలోకి దిగి ప్రాజెక్టులు కడుతోందని వాదించింది. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించలేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని కేంద్రం కోర్టుకు తెలియజేసింది. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇక ముందు కట్టబోయే ప్రాజెక్టులన్నీ అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే నిర్మించాల్సి ఉంటుంది. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా…ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు అనుమతి తప్పనిసరి అవుతుంది.




