పాలీహౌజ్‌లతో కూరగాయల పంటలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పాలీహౌస్‌తో త క్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించుకోవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి కస్తూరి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని సావాపూర్‌, కరంజి గ్రామాలకు మంజూరైన పాలీహౌస్‌ నిర్మాణ పనులను ఆయన  పరిశీలించారు. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ఈ కాలం లో పాలీ హౌస్‌లో దోస, క్యాప్సికం, షేడ్‌నెస్‌ హౌస్‌లో మిర్చి, టమాటా, బీర, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ తదితర కూరగాయల పంటలను వేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం పద్ధతిలో వేసవిలో పండించే పూలు, పండ్లకు అధిక గిరాకి ఉంటుందన్నారు. అనంతరం ఉద్యానవన పంట ల సాగు విధానంపై అవగాహన కల్పించారు. అన్ని రకాల పంటలతోనే రైతుకు ఆదాయం సమకూరుతుందని, ప్రతిరైతు ఇంటిగ్రేటెడ్‌ వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సేంద్రియ ఎరువులతో సాగుచేసిన పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు.  సేంద్రియసాగుతో  పండించిన పంటలను తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. డ్రిప్‌తో పంటలను సాగుచేస్తే తక్కువ నీటివినియోగంతో అధిక మొత్తంలో పంటలను సాగుచేయవచ్చని అన్నారు.సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తే మూడు సంవత్సరాల పాటు దిగుబడి కాస్త తక్కువగా వచ్చినా అనంతరం మంచి దిగుబడులు వస్తాయన్నారు. తక్కువనీటితో అధికంగా సాగుచేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో  మేలు జరుగుతోందని చెప్పారు.