పింఛన్లను పునరుద్ధరించాలని వికలాంగుల ఆందోళన
రంగారెడ్డి:తాండూరు: రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట వికలాంగులు ఆందోళన చేశారు. ఇంతకుముందు అర్హులను ఎంపిక చేసి ఏళ్లుగా పించన్లు చెల్లించి కొంతకాలంగా రద్దు చేశారని వికలాంగులు కార్యాలయం ముందు బైఠాయించి రిలే నిరాహర దీక్ష చేశారు. కార్యాలయం ప్రధాన ద్వారంలో వికలాంగులు కూర్చుని ధర్నా చేశారు. అనర్హులు ఉన్నారనే సాకుతో అధికారులు సదరం శిబిరంలో అర్హులను సైతం తొలగించారని విమర్శించారు. మొత్తం పట్టణంలోని 481మందివికలాంగులకు ఇది వరకు పించన్లు వచ్చేవని, శిబిరం నిర్వహణ అనంతరం 270మందికి రద్దు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు, నాలుగు నెలల నుంచి పింఛన్లు అందక వికలాంగులు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్లను పునరుద్దరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ సీనియర్ అసిస్టెంటు జనార్ధన్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యాదయ్య, అనిత్‌కుమార్, చందు, వెంకటయ్య, కృష్ణ, ఖాజాపాష, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.