పిడుగులు పడేటప్పుడు సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలి

-జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్  -జూలై29(జనంసాక్షి)

పిడుగులు పడేటప్పుడు సురక్షితంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశంలో నల్లని మబ్బులు గుమిగూడడం, మెరుపులు కనిపించడం, ఉరుములు వినిపించడం, వేగంగా గాలులు వీచడం పిడుగులు పడుటకు సంకేతాలని కలెక్టర్ తెలిపారు. ఎత్తైన ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ఫోన్ టవర్లు, విద్యుత్తు టెలిఫోన్ స్తంభాలు, విడివిడిగా ఉండే చెట్లు, గృహాలు, బహిరంగ ప్రదేశాలలో పిడుగులు పడే అవకాశం ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. టీవీ, రేడియోల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకొని, స్థానిక హెచ్చరికలు పాటించాలని, తక్షణం సురక్షిత ప్రాంతాలకు (భవనాలు, ఆఫీసులు, షాపింగ్ సెంటర్లు) వెళ్ళాలని, విద్యుత్ నిలిపి వేయాలని, లోహపు వస్తువులకు, వ్యవసాయ పంపుసెట్లకు దూరంగా ఉండాలని, తప్పని పరిస్థితులలో బహిరంగ ప్రదేశాలలో ఉండవలసి వస్తే మోకాళ్ళ మధ్య తల వంచి, రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా వంగి కూర్చోవాలని, గోడలకు, ద్వారాలకు, కిటికీలకు, ఎండిన చెట్లు, విరిగిన కొమ్మలకు దూరంగా ఉండాలని తెలిపారు. పశుసంపదను సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని, బాధితులకు ప్రథమ చికిత్స అందించాలని వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలని తెలిపారు.పిడుగులు పడే సమయంలో ఆరు బయట ప్రదేశాలలో, రేకుల షెడ్డు క్రింద, వరండాలో ఉండకూడదని, ఆశ్రయం కోసం చెట్ల క్రిందకి వెళ్లకూడదని, నీటిలో ఉండకూడదని, లోహపు పైపుల నుండి వచ్చు నీటిని తాకకూడదు అని, సెల్ ఫోన్ లు ఉపయోగించరాదని, ఉరుములు, మెరుపులు తదుపరి 30 నిమిషాల వరకు బయటకు వెళ్లకూడదని, ట్రాక్టర్ లు, మోటర్ సైకిల్ లు ఆరు బయట నిలిపి ఉంచకూడదని ఆ ప్రకటనలో కలెక్టర్ తెలిపారు