పిలవని కార్యక్రమానికి నేను వెళ్లను


లండన్‌: లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్‌ మాల్యా కనిపించిన దానిపై ఆయన స్పందించారు. ‘నా జీవితంలో నేను ఎప్పుడూ ఆహ్వానించని కార్యక్రమానికి వెళ్లనే లేదు.. పిలవకుండా వెళ్లే అలవాటు తనకు లేదని మాల్యా ట్వీట్‌ చేశారు. నేను నా స్నేహితుడితో పాటు అక్కడికి వెళ్లాను.. నా కుమార్తెతో కలిసి కూర్చొన్నా’ని తెలిపారు. నాపై వస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు.. ఛార్జిషీట్‌ లేదు.. ఈ విషయమై నన్ను నేను ఎందుకు తక్కువ చేసి చూపించుకోవాలి, నా గురించి ఎందుకు చెప్పుకోవాలి ఇది అన్యాయం అని పేర్కొన్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ‘మంత్రాస్‌ ఫర్‌ సక్సెస్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరై ప్రేక్షకుల సీట్లలో ఆయన కూర్చున్నారని భారత హై కమిషనర్‌ నవతేజ్‌ శర్నా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వారి జాబితాలో మాల్యా పేరు లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చామని.. అంతేకాని ఎవరూ ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని తెలిపారు. బ్యాంకులకు రూ.9వేలకోట్లు రుణాలు కట్టాల్సిన కేసులో మాల్యా సీబీఐ నుంచి భారత్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. పలు మార్లు విచారణకు హాజరవ్వాలని ఆయన్ని కోర్టు ఆదేశించినా లెక్క చెయ్యకుండా మాల్యా దేశం వదిలి యూకె వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.