పీఎం ప్రోగ్రాం కవరేజికి తెలంగాణ జర్నలిస్టులకు నో ఎంట్రీ
-వివక్ష చూపించిన సీమాంధ్ర సర్కారు
-రెండు ప్రాంతాల వారిని విడగొట్టిన సీఎం
హైద్రాబాద్, అక్టోబర్ 16(జనంసాక్షి): జీవ వైవిధ్య సదస్సు నేపధ్యంలో మరోసారి సీమాంధ్ర సర్కారు కుటిల యత్నాలు బయటపడ్డయి…మంగళవారం జీవ వైవిద్య వేదికపై ప్రధాని ప్రసంగ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్టులకు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల కవరేజికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది..తెలంగాణపై తేల్చకుండా ప్రధాని హైద్రాబాద్‌లో పర్యటిస్తే అడ్డుకుంటామని హెచ్చరించడంతో భయపడిన సీమాంధ్ర సర్కారు తెలంగాణ జర్నలిస్టులు ఎక్కడ గొడవ చేస్తరో అని జడుసుకుంది..దీంతో తెలంగాణవాదులను కవరేజికి అనుమతించలేదు..దీంతో తెలంగాణ జర్నలిస్టులు దీనిపై మండిపడ్డరు..తెలంగాణ ప్రాంతం వారిని అనుమతించకుండా, సీమాంధ్ర మీడియా ప్రతినిధులను అనుమతించడమేంటని వారు ప్రశ్నించారు. సీఎం రెండు ప్రాంతాల వారిని విడగొట్టారని, సీమాంధ్ర సర్కారు తెలంగాణ వాదం ప్రధానికి వినపడకుండా చేసేందుకు కుటిల యత్నాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి డీకె అరుణ సమాధానం చెప్పాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నాయకులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేసి నాంపెల్లి పీఎస్‌కు తరలించారు. అయితే వారు అక్కడ కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు..వీరికి టీ అడ్వకేట్ జేఏసీ కూడా మద్ధతు పలికింది..అయితే రెండు ప్రాంతాల వారిని విడగొట్టి, కేవలం సీమాంధ్ర ప్రాంతం వారికి అనుమతి ఇచ్చారని, అదే విధంగా తాము కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా విడగొట్టినట్టయితే బాగుంటుంది కదా అని వారు సీఎంకి సూచించారు.