పీవీ సింధుకు గవర్నర్ అభినందనలు
హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధుకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలియజేశారు. సింధు భవిష్యత్‌లోనూ అనేక పతకాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. గవర్నర్ తో పాటు సింధుకు పలువురు ప్రముఖులు అభినందనలు చెప్పారు.
భారత స్టార్ షట్లర్ సింధు… దేశ బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంచలనం సృష్టించింది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగోసీడ్ సింధు 19-21, 22-20, 20-22తో ఏడోసీడ్ నొజొమి ఒకుహర (జపాన్) చేతిలో ఓడి రెండోస్థానంతో సరిపెట్టుకుంది. భారత్ తరఫున ఫైనల్ చేరిన రెండో క్రీడాకారిణిగా రికార్డులకెక్కిన సింధు గతంలో రెండుసార్లు ఇదే చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలను సాధించింది. ఓవరాల్‌గా సైనా కాంస్యంతో కలిపి ఈసారి చాంపియన్‌షిప్‌లో భారత్ ఎప్పుడు లేని విధంగా రెండు పతకాలు గెలిచి మరో రికార్డును సొంతం చేసుకుంది. గతంలో భారత్‌కు రజతంతో పాటు నాలుగు కాంస్యాలు లభించాయి. 1983లో ప్రకాశ్ పదుకొనే భారత్‌కు తొలి కాంస్యాన్ని అందించాడు. 2011లో డబుల్స్‌లో అశ్విని-జ్వాల జోడి మళ్లీ కాంస్యంతో మెరిసింది.