పుట్టలో పాలుపోయడంలో పరమార్థం వేరు !
తిరుమల,ఆగస్ట్21 (జనం సాక్షి) :గరుడ పంచమి, నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోస్తూ.. ’నాగయ్యా! నీకు పొట్ట నిండా పాలు పోసేమయా..’ అంటూ పాడుకోవడం మనకు తెలిసిందే. వేయి పడగల పాముగా అఖండ భూభారాన్ని అవలీలగా మోస్తున్న జగన్నాథుడికి శయ్యగా అమరింది అనంతుడనే సర్పం. అమృతపాన కాంక్షితులైన దేవాసురుల కోరిక మేరకు మహామేరు నగాన్ని తాడులా చుట్టుకుంది వాసుకి అనే భుజంగం. అలా అడుగడుగునా సృష్టి క్రమానికి తన వంతు సాయమందించింది సర్పజాతి. పురాణ కథలను అనుసరించి క్షీరసాగర మథనంలో ముజ్జగాలనూ అల్లల్లాడిరచిన హాలాహలాన్ని తాను స్వీకరించి అభయం ప్రసాదించాడు శంకరుడు. ఆ పరమశివుని అనుచర గణాలుగా సర్పాలు సైతం తమకు చేతనైనంతగా విషభక్షణ చేశాయి. కనుకనే అవి విషపూరితం అయ్యాయంటారు ఆధ్యాత్మికవేత్తలు. ఒక్క మాట.. పాములు పాలు తాగవనీ, బలవంతంగా పాలు తాగించేందుకు ప్రయత్నిస్తే వాటి ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని కొందరి భావన. మన పెద్దలు పుట్టలో పాలు పోయమన్నది పాములు ఆ పాలు తాగి జీవించాలని కాదు. తార్కికంగా ఆలోచిస్తే పాలతో తడిసిన పుట్టమన్నుచీమలకు ఆహారాన్ని ఇవ్వగలదు. ఆ చీమలను తినే కీటకాలు, వాటిని తినే కప్పలు.. అలా పుట్ట వద్దకు చేరిన జీవాలు పాములకు ఆహారంగా మార్చగలిగే పరోక్ష పక్రియ కావచ్చు. ఒక పాము తన జీవిత చక్రంలో కుబసం విడిచి మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కుబసం విడవటం అనే సంక్లిష్ట పక్రియ మన జననమరణ చక్రాన్ని కళ్లకు కట్టినట్టు చూపించగలదని కాబోలు.. మన పెద్దలు నాగేంద్రుడు అంటూ పాముకు దైవీతత్వాన్ని స్థిరపరచారు. భూమిపై పుట్టిన మనిషి అరిషడ్వర్గాలతో కూడిన ఐహిక బంధాల నడుమ కొంత కాలం గడుపుతాడు. నెమ్మదిగా ఆ కుబుసాన్ని విడిచి తనలో దాగి ఉన్న ఒక్కో శక్తిని విశ్లేషిస్తూ, జాగృతపరుస్తూ అమృతత్వం వైపు అడుగులు వేసి మనీషిగా బతకాలన్నదే నాగపూజలో దాగున్న అంతర్యామి..
““““““““