పువ్వాడ అజయ్ నామినేషన్ తిరస్కరించాలని ఈసీకి తుమ్మల ఫిర్యాదు..

ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ ను తిరస్కరించాలని అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఅర్ఎస్ అభ్యర్థి పువ్వాడ ఆఫిడవిట్ సరైన ఫార్మాట్ లో లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్ కాకుండా ఆయన ఫార్మాట్ ను మార్చి నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. ఈ మేరకు తుమ్మల రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. డిపెండెంట్ కాలమ్ లో ఎవ్వరు లేకపోతే నిల్ రాయకుండా మార్చారని తెలిపారు. నాలుగు సెట్స్ నామినేషన్లు తప్పులతడకగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా స్థానిక రిటర్నింగ్ అధికారి తీరుపై కూడా ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ప్రెస్క్రైబ్ ఫార్మాట్ లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారికి తెలిపామని అయినా స్పందించలేదని స్పష్టం చేశారు. ఆర్వో పై న్యాయ పోరాటం చేస్తానని తుమ్మల ఉద్ఘాటించారు. ఆర్వో ఏమాత్రం ఎన్నికల నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు చేశారు.