పూజలతో అమ్మ సంతోషించింది
– బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలి
– గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోరికలు తీరుతాయి
– వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి
– భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత
హైదరాబాద్, జులై22(జనంసాక్షి) : ఆషాఢమాస బోనాల జాతర అంగరంగవైభవంగా సాగుతోంది. రెండోరోజు సోమవారం ఉదయం 10 గంటలకు రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. రంగంలో అమ్మవారి భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగే ప్రశ్నలకు స్వర్ణలతలో ఆవహించిన అమ్మవారు సమాధానాలు చెప్పారు. అమ్మవారికి అభిముఖంగా ఉన్న మాతంగి ఆలయం వద్ద స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారిని ఆవహింపజేసుకున్నారు. ఆమెవైపు చూస్తూ భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది నా ప్రజలందరూ సంతోషంగా ఆలయానికి వచ్చి మొక్కులు, ముడుపులు చెల్లించుకున్నారు. నేనుకూడా వారి పూజలతో సంతోషించానని ఆవహించిన అమ్మవారు అన్నారు. నా అక్కాచెలెళ్లు ఆనందంగా ఉంటే తానూ సంతోషమేనని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని వెల్లడించారు. ప్రజల కోరికలన్నీ తీరుతాయని, పూజలతో సంతృప్తి చెందానని అన్నారు. ఏటా భక్తులు తనవద్దకు సంతోషంగానే వస్తున్నారని, అయితే ఈసారి మాత్రం ఆనందమే లేకుండా పోయిందెందుకని స్వర్ణలత ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున సమర్పించిన బంగారు బోనం కొంత సంతోషం.. కొంత దుఖాన్ని కలిగించిందని చెప్పారు. బంగారు బోనంతో ఆనందపర్చడమనేది మూర్ఖత్వమే అని అన్నారు. ఆడపడుచులందరూ దుఖంతో ఉన్నారని ఆమె తెలిపారు. అయితే ఈ సారి మాత్రం ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని స్వర్ణలత చెప్పడం కొసమెరుపు. సగం కాలమైపోయింది వర్షాలు సక్రమంగా పడలేదని అడిగితే.. వానలు తప్పకుండా కురుస్తాయి కానీ, తనకు పూజలు ఎందుకు ఆపారని, వారం రోజులు మారు పూజ ఎందుకు ఆపారని ప్రశ్నించారు. నా ప్రజలందరు చూడగా పూజలు అందుకున్నానని, సిబ్బంది కూడా నా బిడ్డలే కాదు వారిని సంతోషపెట్టే బాధ్యత తనదేనని అన్నారు. నా సోదరి గంగాదేవికి బోనం సమర్పించి, జలాభిషేకం చేస్తే తప్పకుండా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా ఉంటాయని వివరించారు. నా అక్కచెలెళ్లు ఈ ఏడు ఆనందంగా ఉన్నారని, వారిని అలా చూస్తే తనకు ఎందో సంతోషంగా ఉందన్నారు. చేసిన కార్యక్రమాలకు సంతోషిస్తున్నానని అన్నారు. అయితే, ఐదు వారాలు పప్పు బెల్లాలు, పలహారాలతో తనకు శాకాలు సమర్పించాలని అమ్మవారు పేర్కొన్నారు. ఒక వారం అక్కచెలెళ్లతో కలిసి పోలిమేర దాటి మాత్రమే వెళ్లాలని, అంతకంటే ఎక్కువ దూరం పోవద్దని భవిష్యవాణిలో తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి ఆపదరానివ్వబోనని, వారిని కాపాడే బాధ్యత తనదని అమ్మవారు హావిూ ఇచ్చారు. కాకపోతే మారు బోనం తప్పకుండా తీయాలని ఆదేశించారు.