పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను ప్రభుత్వమే భరించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుతో పేద , మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని పీడీఎస్ యు రాష్ట్ర నాయకులు ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు.బుధవారం ఆ సంఘ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజామాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.ఇష్టానుసారంగా ఫీజులను పెంచుకోవడం సరైనది కాదన్నారు.రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులను పెంచడం అంటే పేద, మధ్య తరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడమే అవుతుందన్నారు.తక్షణమే ప్రభుత్వం ఫీజు పెంపుపై కౌంటర్ దాఖలు చేసి ఫీజుల ఉపసంహరణ చేసేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు.మూడేళ్లకు ఒకసారి నిర్ణయించే ఫీజులపై ప్రభుత్వం సకాలంలో స్పందించి నిర్ణయం చేయకపోవడం, కౌన్సిలింగ్ ప్రారంభమై సీట్లు కేటాయించే నాటికి కూడా ప్రభుత్వం మౌనం వహించడం సరైనది కాదని అన్నారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి పేద, మధ్య తరగతి విద్యార్థులపై బారం పడకుండా విధివిధానాలు ప్రకటించి, పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీకాంత్, పరశురామ్, చంటి, మధు తదితరులు పాల్గొన్నారు.