పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
ఖమ్మం, అక్టోబర్ 28 : ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం చేపట్టిన సాగునీటి సాధన మహారైతు యాత్ర జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నదాత రైతన్నలకు సాగునీరు కరువైందని, గిట్టుబాటు ధరలు సైతం లభించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ముగూడెంలోని రాజీవ్‌సాగర్‌ను డిజైన్ మార్చి పాలేరు రిజర్వాయర్‌లో కలపాలని, ఏజెన్సీ మండలాలను ఏడింటిని జలసమాధి చేస్తూ మన్యం ప్రాంతానికి తలమానికమైన గిరిజన సంస్కృతి సంప్రదాయాలను జలసమాధి చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందిరాసాగర్‌ను గోదావరి ప్రస్తుత ప్రవాహం ఆధారంగా పూర్తి చేయాలన్నారు. సిపిఎం కేంద్రసమితి సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దుమ్ముగూడెం ఎడమ కాల్వ నుంచి గ్రావిటి ద్వారా దుమ్ము గూడెం, కూనవరం, భద్రాచలం మండలాలకు సాగునీరు అందివ్వాలన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేం దుకు ఎన్నో రకాల నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన అన్నారు. సాగునీటి సాధన మహారైతు యాత్ర ద్వారా జిల్లా ప్రధాన సమస్యలతో పాటు సాగునీటి సమస్యల పరిష్కారానికి సిపిఎం మరోపోరాటం ప్రారంభించిందన్నారు. 14 రోజుల పాటు 300 కిలోమీటర్ల మేర తమ పాదయాత్ర సాగుతుందని వీరభద్రం అన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుడుబాబూరావు,సిపిఎంజిల్లాకార్యదర్శి సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.