పెగాసస్‌పై అనవసర రాద్దాంతం

అభద్రతా భావంతో ఉన్న ప్రభుత్వం
మండిపడ్డ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

అమరావతి,జూలై7(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసెస్‌ ఇక్యూప్‌మెంట్‌ కొన్నారని అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ… పెగాసెస్‌ ఇక్యూప్‌మెంట్‌ చంద్రబాబు కొనలేదని గౌతమ్‌ సవాంగ్‌ ఆర్‌టీఐ ద్వారా సమాధానం ఇచ్చారని… కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో
ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారని ఆయన విమర్శించారు. పెగాసెస్‌పై పెద్ద సభా కమిటిని వేసి చర్చ నిర్వహించడం వృధాప్రాయాసే అయిందన్నారు. పెగాసెస్‌ విూద చర్చ జరగాలని శాసనసభలో వేస్ట్‌గా షార్ట్‌ డిస్కసన్‌ కూడా పెట్టారని అన్నారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుగ్గన రాజేందర్‌ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ల్యాప్‌ట్యాప్‌లు ఏ ఎమ్మెల్యే వాడటంలేదని తెలిపారు. సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా టీడీపీ నాయకులపై నిరర్థకం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, సొంత పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజంకాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్‌కు సిద్ధమా… మంత్రులు, ఎమ్మెల్యేలచే ఆరోపణలు చేయించడంకాదు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా?… కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీకి సిద్ధమా? అంటూ పయ్యావుల కేశవ్‌ సవాల్‌ విసిరారు.