పెట్టుబడి సాయం వ్యవసాయానికే ఉపయోగించాలి: ఆర్డీవో
నిజామాబాద్,మే17(జనం సాక్షి ): రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవాలని నిజమాబాద్ ఆర్డీవో వినోద్‌కుమార్ సూచించారు. బాల్కొండలో గురువారం రైతులకు కొత్తపట్టాదారు పాసుపుస్తకాలతో పాటు పెట్టుబడిసాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కార్యక్రమం నిర్వహించగా పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచి గంగాధర్, రైతు సమన్వయసమితి మండల సమన్వయకర్త విద్యాసాగర్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే బాల్కొండ మండలం చిట్టాపూర్‌లో రైతుబంధు పథకం కింద పెట్టుబడిసాయం చెక్కులను ఈనెల 18న పంపిణీ చేయనున్నట్లు మండల రైతుసమన్వయసమితి మండల సమన్వయకర్త విద్యాసాగర్ తెలిపారు. స్థానిక
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 7గంటలకు చెక్కుల పంపిణీ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. చిట్టాపూర్‌తో పాటు శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రైతులు పెట్టుబడిసాయం చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలని ఆయన సూచించారు.