పెట్టుబడులతో భారత్‌కు రండి

2
పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రధాని మోదీ

సియోల్‌, మే19(జనంసాక్షి) :  రెండో రోజు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. సియోల్‌లో కొరియా పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మోదీ… భారత్‌కు పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు. కొరియా ప్రపంచానికి అనేక రంగాల్లో నాణ్యమైన సేవలందిస్తోందని అభినందించారు. ఎలక్గానిక్స్‌, ఆటోమొబైల్స్‌ వంటి రంగాల్లో కొరియా ప్రపంచానికి అద్భుతమైన ఉత్పత్తులు అందించిందని, కొరియా సంస్థలు నిర్మాణ రంగంలోనూ ముందున్నాయని ఆయన పేర్కొన్నారు. భవనాలు, స్మారక నిర్మాణాల్లోనూ కొరియాది ప్రత్యేకతేనన్నారు. మౌలిక రంగం, రోడ్ల అభివృద్ధిలో చక్కని ఫలితాలు సాధించారన్నారు. భారతీయుడిగా కొరియా విజయాలు సాధించిన రంగాల్లో భారత్‌లోనూ చక్కని ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నానన్న ఆయన, భారత్‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని అక్కడి పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ సందర్భంగా హ్యుందాయ్‌ మోటార్స్‌, శామ్‌సంగ్‌ ప్రతినిధులతోనూ మోదీ భేటీ అయ్యారు.

ఆసియా దేశాల 6వ నాయకత్వ సదస్సులో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దం ఆసియాదేనని పునరుద్ఘాటించిన మోదీ…. ఆసియా దేశాలు మరింత సహకారంతో పనిచేయాలని కోరారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని వెల్లడించారు. ప్రపంచానికి సవాల్‌గా మారిన ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాల్సి ఉందన్నారు. రాజధాని సియోల్‌ నడిబొడ్డులో ప్రవహించే చంగేచెన్‌ నది పరిసరాలను పరిశీలించారు. గంగా ప్రక్షాళన కోసం మోదీ చంగేచెన్‌ నది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకప్పుడు కాలుష్యంతో నిండిపోయిన ఆ నదిలో ప్రక్షాళన చేపట్టారు. ఆ తరువాత అది మంచినీటి నదిగా మారింది. ఇప్పుడు ఆ నది చుట్టూ షాపింగ్‌ మాల్స్‌ సైతం ఏర్పాడ్డాయి. డౌన్‌టౌన్‌లో ఉన్న ఆ ప్రాంతాన్ని మోదీ కలియతిరిగారు. అక్కడి అధికారులు మోదీకి నదీ ప్రక్షాళన వివరాలను వెల్లడించారు. చెంగేచెన్‌ డౌన్‌టౌన్‌కు వచ్చిన ప్రధాని మోదీని తిలకించేందుకు ప్రవాసభారతీయులు కూడా ఎగబడ్డారు. ఆయన్ను కలుసుకునేందుకు పోటీపడ్డారు. ప్రధాని మోదీ ప్రవాసభారతీయులకు అభివాదం చేశారు. ఆ తరువాత ఆరవ ఏషియన్‌ లీడర్‌షిప్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మోదీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.