పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు తగ్గాయి!

దిల్లీలో : దేశ రాజధాని దిల్లీలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సరి-బేసి నిబంధనల ప్రభావం ఇంధన అమ్మకాలపై పడినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో దిల్లీలో పెట్రోలు, డిజీల్‌ అమ్మకాలు 25 శాతం తగ్గినట్లు బంక్‌ యజమానులు చెబుతున్నారు. దిల్లీలో జనవరి 1 నుంచి సరి-బేసి వాహన నిబంధనలు అమలవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం.. ప్రయివేటు వాహనాలు రోజు విడిచి రోజు మాత్రమే రోడ్లమీదకు రావాలి. వాహనాల వినియోగం తగ్గడంతో పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. గడిచిన ఏడు రోజుల్లో 25శాతం వరకూ అమ్మకాలు తగ్గినట్లు పలు పెట్రోలు బంక్‌ల యజమానులు తెలిపారు. దిల్లీలో 400 ఫిల్లింగ్‌ స్టేషన్‌లు ఉండగా.. ప్రతినెలా సగటున 4.7లక్షల లీటర్ల ఇంధనం అమ్ముడయ్యేది. అయితే తాజా నిబంధనలతో ఈ సంఖ్య 3 లక్షల లీటర్లకు తగ్గిపోనున్నట్లు ఆల్‌ ఇండియా పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ అజయ్‌ బన్సాల్‌ పేర్కొన్నారు.