పెట్రోల్ బంక్ కబ్జా
ఓయూ విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్,మే26(జనంసాక్షి): ఓయూ భూముల ఆక్రమణలపై విద్యార్థుల దండయాత్ర కొనసాగుతోంది. రెండోరోజు వారు తమ ఆందోళన కొనసాగించారు. సోమవారం స్వాగత్ ¬టల్‌పై దాడికి దిగితే మంగళవారం ఓయూలోని తార్నక పెట్రోల్ బంక్‌పై దాడికి దిగారు. ఓయూ భూములను కబ్జా చేసుకున్న వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఉస్మానియా వర్సిటీ స్థలంలో ఆక్రమించి కట్టుకున్న స్థలాలను వదిలేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. ప్రభుత్వం ముందుగా ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణల గుట్టును వెలికి తీస్తామని అన్నారు. ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం తార్నాకలోని ఓ పెట్రోల్ బంక్‌పైకి దాడికి ప్రయత్నించారు. ఇది ఓయూ ఆక్రమిత భూమిలో ఏర్పాటు చేశారని వారు ఆరోపిస్తున్నారు. అయితే సమయానికి అక్కడకు చేరుకున్న పోలీసులు వారి ప్రయత్నాలను వమ్ము చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేకుంటే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు హెచ్చరించారు. కాగా ఓయూ భూముల్లో ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనకు నిరసనగా ఆర్ట్స్ కళాశాల ఎదుట సోమవారం ఏబీవీపీ కార్యకర్తలు చేతులకు తాళ్లు కట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మరోవైపు ఓయూలో ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న నిరుద్యోగ సింహగర్జన బహిరంగ సభను, జూన్ 2న తెలంగాణ అవతరణ ఉత్సవాలను బహిష్కరించి నల్లజెండాలతో నిరసన తెలియజేయనున్నట్లు టి.విద్యార్థి నిరుద్యోగ జేఏసీ పేర్కొన్న విషయం తెలిసిందే.