పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం?!
మానవ అభివృద్ధి సూచీలో ఐదో స్థానంలో ఉన్న నెదర్లాండ్ మరో ముందడుగు వేసేలా కనబడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు 2025 నాటికి పూర్తి స్థాయిలో నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు లేబర్ పార్టీ అక్కడి దిగువసభలో బిల్లును ప్రవేశపెట్టింది. కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే 2025 తర్వాత అమ్మకాలు జరపాలని తమ ప్రతిపాదనలో పేర్కొంది.ట్విడ్ కమెర్(పార్లమెంట్ దిగువ సభ)కు ఎన్నికైన వారిలో మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఉన్నారు. ఈ నిర్ణయంతో అప్పటి వరకు ఉన్న పెట్రోల్, డీజిల్ కార్లు రోడ్లపై తిరిగే అవకాశం ఉంటుంది. కానీ, కొత్త పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలు పూర్తిగా ఆపివేస్తారు. డచ్ పార్లమెంట్లో దీనిపై పూర్తి స్తాయిలో చర్చజరిగే అవకాశం ఉంది. ఒక వేళ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు ఇదొక సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో పెట్రోల్, డీజిల్ కార్ల ద్వారా వచ్చే కాలుష్యానికి చెక్ పెట్టొచ్చు. నెదర్లాండ్లో మొత్తం 29 శాతం రవాణాకోసం శక్తిని వినియోగిస్తుంటే వీటిలో కేవలం 10 శాతం మాత్రమే పునరుత్పాదక వనరులపై ఆధారపడుతోంది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రపంచంలోని మిగతా దేశాలకు నెదర్లాండ్ ఆదర్శదేశంగా నిలువనుంది.