పెట్రో ధరలు తగ్గించేందుకు కృషి

– కేంద్ర మంత్రి ధర్మేంద్ర

 

అహ్మదాబాద్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి):కొద్ది రోజుల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల అమెరికాలో వచ్చిన హరికేన్‌ల కారణంగా ధరలు పెరిగాయన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినందున ఇక్కడ తగ్గుతాయని తెలిపారు. మూడు రోజులుగా ధరలు తగ్గుతున్నాయని అన్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తారా అని ప్రశ్నించగా, అభివృద్ధి పనుల కోసం నిధులు కావాల్సి ఉన్నందున ఆ పని చేయబోమన్నారు.

ప్రధానమంత్రి ఎల్పీజీ పంచాయత్‌ ప్రారంభం

గాంధీనగర్‌కు సవిూపంలోని మోట ఇస్నాపూర్‌ గ్రామంలో ‘ప్రధానమంత్రి ఎల్పీజీ పంచాయత్‌’ను ప్రారంభించారు. వినియోగదారులతో గ్యాస్‌ సరఫరాదార్లు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమావేశమై సమస్యలు పరిష్కరించడం, సలహాలు స్వీకరించడమే దీని లక్ష్యం. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మూడు కోట్లవ లబ్ధిదారు కోకిలాబెన్‌ పర్మార్‌కు గ్యాస్‌ కనెక్షన్‌ అందజేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ పాల్గొన్నారు.