పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

supreme_court_of_india_-_central_wingపెద్ద నోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు స్వీకరించకుండా హైకోర్టులను ఆపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని, ప్రస్తుత పరిస్థితి హింసాత్మక సంఘటనలకు దారి తీయవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌, జస్టిస్‌ ఎ.ఆర్‌.దవెతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బ్యాంకులు, తపాలా కార్యాలయాల బయట బారెడు వరుసల్లో నిలబడాల్సి రావడం తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.’’ అని స్పష్టం చేసింది. ‘‘కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూడండి. హైకోర్టులకు వెళ్లకుండా వారిని నిలువరిస్తే సమస్య తీవ్రత ఎలా అర్థమవుతుంది? వివిధ న్యాయస్థానాలకు ప్రజలు వెళ్లడం.. సమస్య తీవ్రతను సూచిస్తుంది.’’ అని ధర్మాసనం చెప్పింది. పెద్ద నోట్ల రద్దు అంశంపై దాఖలయ్యే పిటిషన్లను సుప్రీంకోర్టు మినహా దేశంలోని ఏ ఇతర న్యాయస్థానమూ విచారించకుండా ఆదేశాలివ్వాలని కేంద్రం.. సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.