పెద్దనోట్ల రద్దు అట్టర్‌ ప్లాప్‌

– 99 శాతం నోట్లు తిరిగొచ్చాయి

-వెల్లడించిన ఆర్‌బీఐ

ముంబై,,ఆగష్టు 30,(జనంసాక్షి): రద్దయిన నోట్లలో దాదాపు 99 శాతం తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంక్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఏడాది మోడీ సర్కార్‌ రద్దు చేసిన మొత్తం 15.44 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లలో 15.28 లక్షల కోట్లు తిరిగి వచ్చాయని అందులో పేర్కొంది. రద్దయిన నోట్లలో 8900 కోట్ల విలువైన వెయ్యి నోట్లు మాత్రమే రాలేదని స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం మార్కెట్‌లో చెలామణిలో ఉన్న నోట్లలో కొత్తగా ప్రవేశపెట్టిన 2000 నోట్ల విలువ మార్చి చివరి నాటికి 50 శాతంపైనేనని ఆర్బీఐ తెలిపింది. 2016-17లో కొత్త నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ 7965 కోట్లను ఖర్చు చేసింది. ఈసారి మార్కెట్లో కరెన్సీ చెలామణి గతేడాది కంటే 20.2 శాతం తగ్గిందని కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. గతేడాది నవంబర్‌ 8న 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డిసెంబర్‌ 30 వరకు రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇన్నాళ్లయినా ఎన్ని రద్దయిన నోట్లు తిరిగి వచ్చాయన్న విషయాన్ని ఆర్బీఐ గతంలో ఎప్పుడూ వెల్లడించలేదు. తాజాగా తమ వార్షిక నివేదికలో మాత్రం ఈ వివరాలను పొందుపరిచింది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం కేవలం 1.2 శాతం మాత్రమే రద్దు అయిన నోట్లు వెనక్కి రాలేదని స్పష్టమవుతోంది.