పెద్దపల్లిలో సీటుకోసం కాంగ్రెస్‌లో పోటీ
స్థానికులకే ఇవ్వాలంటున్న నేతలు
టిఆర్‌ఎస్ నుంచి భరోసాగా వివేక్
తెరపైకి మరికొందరి పేర్లు
పెద్దపల్లి,ఫిబ్రవరి19(జనంసాక్షి): పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ బాగా ఉంది. మాజీలంతా ఇక్కడ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్థానికులకే అన్న నినాదం తెరపైకి వచ్చింది. ఇక టిఆర్‌ఎస్‌లో కెసిఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. మాజీ ఎంపీ వివేక్ టికెట్టు రేసులో ముందున్నట్లు కనిపిస్తున్నారు. సిట్టింగ్ ఎంపి బాల్క సుమన్‌ను అసెంబ్లీ ఎన్నికలకు పంపడంతోనే ఆయనకు బెర్త్ ఖరారయయ్యిందని అంతా భావిస్తున్నారు. సిఎం కెసిఆర్‌తో సన్నిహితంగా ఉంటున్న వివేక్‌కు టిక్కెట్ ఖాయమని ఆయన అనుచరులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో పెద్దపల్లి సీటును మల్లెపల్లి లక్ష్మయ్య, గంటా చక్రపాణిల పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన వీరిలో ఒకరికి అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. వీరు కాకుండా మాజీ ఎ మ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట ప్రవీణ్ కుమార్ కూడా తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే వివేక విషయంలో స్థానికంగా టిఆర్‌ఎస్‌లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచిన, ఓడిన ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. ఆయనకు సీటిస్తే ఒప్పుకునేది లేదని వీరంతా తెగేసి చెపుతుండడంతో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని టీఆర్‌ఎస్ వర్గాలు చూస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి కూడా పెద్దపల్లి కోసం పోటీ పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఆరెపల్లి మోహన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పోటీ పడుతున్నారు. టీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఆసిఫాబాద్, పెద్దపల్లిలో మంథని స్థానాలు మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. అయినా పెద్దపల్లిలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌కు ధీటుగా ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్‌లో ఆదిలాబాద్, ముథోల్ స్థానాల్లో ఆ పార్టీకి మూడో స్థానం దక్కడంతో ఓట్ల శాతం తగ్గింది. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉందని భావిస్తున్న 8 సీట్లలో ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి స్థానం కోసం ఇప్పటికే సుమారు 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 2009లో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్, అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ బంధువు మన్నె క్రిశాంక్, కవ్వంపల్లి సత్యనారాయణ, దుర్గా భవాని, గుమ్మడి కుమారస్వామి, ఊట్ల వరప్రసాద్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. చెన్నూరు నుంచి పోటీ చేసిన వెంకటేశ్ నేత టీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నట్లు సమాచారం.