‘పెద్దల’ సభకు టీడీపీ ఎంపీల డుమ్మా

– డీల్‌ కుదిరిందా.. ప్యాకేజీలా.. జంప్‌ జిలానీలా?

– బాబు ఆగమాగం

– ఎఫ్‌డీఐలపై ఒక్కో సభలో ఒక్కో విధానం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) :

చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గురువారం రాజ్యసభలో నిర్వహించిన ఓటింగ్‌కు తెలుగుదేశం పార్టీ ఎంపీలు డుమ్మా కొట్టారు. లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో పాల్గొని వ్యతిరేకంగా నిలిచిన ఆ పార్టీ రాజ్యసభకు వచ్చేసరికి స్టాండ్‌ మార్చుకుందా లేక ప్యాకేజీలతో యూపీఏ ప్రభుత్వం ఎంపీలను కొనుగోలు చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడుతోందని కొంతకాలంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని తెలంగాణవాదులు బాహాటంగానే పేర్కొనేవారు. వీటికి బలం ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేతే పలు సందర్భాల్లో వ్యవహరించారు. పెద్దల సభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ను ఎదుర్కొనేంత సంఖ్యా బయం యూపీఏకు లేదు. లోక్‌సభలోనే సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌ పార్టీలు ఓటింగ్‌కు దూరమై ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. రాజ్యసభలో పూర్తి సభ్యులు హాజరైతే అధికారపక్షానికి 29 మంది ఎంపీలు తక్కువగా ఉంటారు. ఉభయ సభల్లో ఆమోదం పొందితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఈ నేపథ్యంలో ఎంపీలను బుజ్జగించేందుకు అధికార పక్షం పెద్ద ఎత్తున తాళలాలు, ప్రలోభాలకు గురి చేసినట్లుగా ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఈనేపథ్యంలోనే టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు డుమ్మా కొట్టారనే ప్రచారం సాగుతోంది. అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, తూళ్ల దేవేందర్‌గౌడ్‌, బీసీ కోటాలో పెద్దల సభకు ఎంపీ చేశారని ఎప్పుడూ కృతజ్ఞత చూపే గుండు సుధారాణి ఆయనకు చెప్పకుండా గైర్హాజరవుతారా అనే అనుమానాలు ఉన్నాయి. అధినేత కుమ్మక్కు వ్యవహారంలో భాగంగానే ఇది జరిగిందని టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు, తెలంగాణవాదులు ఆరోపించారు. ఇది నిజం కాకపోదని మరికొందరు పేర్కొంటున్నారు. పెద్దల సభలో ఓటింగ్‌ సమయానికి ఇద్దరు ఎంపీలు అజ్ఞాతంలోకి వెళ్లగా, డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఉంటేనే బయటకు వెళ్లానని దేవేందర్‌గౌడ్‌ తెలిపారు. ఓటింగ్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు. ఎంపీల డుమ్మా గురించి ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌ పాదయాత్రలో ఉన్న చంద్రబాబునాయుడు తెలుసుకొని ఆగమాగమయ్యారు. ఎంపీల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎంతగా ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెలంగాణవాదులు టీడీపీ ఎంపీలు, చంద్రబాబు తీరుపై భగ్గుమన్నారు.