పెద్ద నోట్ల రద్దు’ ఓ మేలిమలుపు

– నల్లధనం బెడద నుండి దేశానికి విముక్తి కలిగించేందుకే రద్దుచేశాం

– నోట్ల రద్దు సమయంలో 2.97 లక్షల బోగస్‌ కంపెనీలను గుర్తించాం

– వాటి గుర్తింపు రద్దుచేశాం

– ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే 2016 నవంబర్‌ 8వ తేదీ ఓ ‘మేలిమలుపు’ అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభివర్ణించారు. నల్లధనం బెడద నుంచి దేశానికి విముక్తి కలిగిచేందుకు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్న రోజని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రచించిన ప్రణాళిక చెత్తగా ఉందని, ఆదరాబాదరాగా అలు చేశారని మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం చేసిన విమర్శలను జైట్లీ తిప్పికొట్టారు. అవినీతి, నల్లధనం విషయానికి వచ్చేసరికి మనమేవిూ చేయలేమనే నిర్లిప్త వాతావరణంలో మనం (దేశప్రజలు) జీవనం సాగిస్తూ వచ్చాంరన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, అట్టడుగు వర్గాల్లో నిస్సహాయత కనిపించేదని జైట్లీ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఉన్న చట్టాలను లోతుగా అధ్యయనం చేసి కట్టుదిట్టమైన అమలుకు నడుం బిగించిందని, నల్లధనం వ్యతిరేక పోరాటాన్ని సమర్థవంతంగా మూడేళ్లుగా అమలు చేస్తోందని జైట్లీ తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో స్వల్ప, మధ్యకాలిక ఫలితాలు సానుకూలంగా వచ్చాయని,ముఖ్యంగా నగదు చలామణిని తగ్గించడం ద్వారా వ్యవస్థలోకి నల్లధనం ప్రవాహాన్ని నిలువరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసిందని జైట్లీ అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నట్టు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. నోట్ల రద్దు పీరియడ్‌లో సేకరించిన డాటా ప్రకారం 2.97 లక్షల బోగస్‌ కంపెనీలను గుర్తించామని చెప్పారు. అనంతరం నోటీసులు పంపి 2.24 లక్షల కంపెనీల రిజస్టేష్రన్లను రద్దు చేశామని తెలిపారు. బ్యాంకు అకౌంట్లు స్తంభింపజేయడం, బోర్డ్‌ ఆఫ్‌ కంపెనీల నుంచి డైరెక్టర్లను డిబార్‌ చేయడం జరిగిందన్నారు. డిజిటల్‌ పేమెంట్ల పరంగా చూసినప్పుడు రూ.3.3 లక్షల కోట్లు విలువచేసే 110 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. మరో 3.3 లక్షల కోట్ల మేరకు క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు జరిగాయన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో రాళ్లు రువ్వే ఘటనలు, దేశంలోని కొన్ని జిల్లాల్లో నక్సల్‌ కార్యకలాపాలు తగ్గాయని ఆయన చెప్పారు. నకిలీ భారత కరెన్సీ ప్రవాహానికి అడ్డుకట్ట పడిందని తెలిపారు. తాము చేపట్టిన చర్యల వల్ల నిజాయితీ, పారదర్శక ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్‌ పురోగమిస్తోందని జైట్లీ వివరించారు.