పెద్ద హిరోల‌తో స‌మానంగా ‘చిన్న’ హీరోలు!

'చిన్న' హీరోలు!
 వన్డే వరల్డ్ కప్ లీగ్ పోరు ముగిసింది. ఈసారి చిన్నటీమ్ లలో పలువురు ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. పరుగులు చేయడంలోనే కాదు, వికెట్లు పడగొట్టడంలోనూ స్టార్ ఆటగాళ్లతో సరిసమానంగా నిలిచారు. మేటి ఆటగాళ్లకు దీటుగా సత్తా చాటి హీరోలుగా నిలిచారు.

చిన్న జట్లలో యూఈఏ మినహా అన్ని జట్లు విజయాలు అందుకున్నాయి. అప్ఘానిస్తాన్ తొలి విజయాన్ని అందుకోవడం విశేషం.

ఏమాత్రం గెలుపు అవకాశాల్లేని దశ నుంచి పుంజుకుని తన కంటే మెరుగైన స్కాట్లాండ్ పై అప్ఘాన్ విజయం సాధించడానికి కారణం సమీముల్లా షెన్వారి పోరాట పటిమ.. 96 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ జట్టుకే చెందిన పేసర్ హామిద్ హాసన్ మొత్తం 7 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సెంచరీల వీరుడు సంగక్కరను అవుట్ చేయడం ఈ ఏడాదిలో తాను తీసిన బిగ్ వికెట్ అని చెప్పాడు హామిద్. షాపూర్ జద్రాన్ కూడా అప్ఘాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి 10 బంతుల్లో 12 పరుగులు చేసి జట్టును గెలిపించిన జద్రాన్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇదే మ్యాచ్ లో 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద 8 వికెట్లు పడగొట్టి టాప్ టెన్ బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

అసోసియేట్ టీమ్ తరపున వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా యూఏఈకు చెందిన షయ్ మాన్ అన్వర్ ఘనత సాధించాడు. 309 పరుగులు చేసి టాప్ టెన్ బ్యాట్స్ మెన్ జాబితాలో నిలిచాడు. అన్వర్ ఖాతాలో ఒక సెంచరీ కూడా ఉంది.

స్కాట్లాండ్ బౌలర్ జోష్ దావే 15 వికెట్లు తీసి లీగ్ దశలో టాప్ బౌలర్ల లిస్టులో 4వ స్థానంలో నిలిచి సత్తా చాటాడు. సంగక్కర, దిల్షాన్, జయవర్థనే లాంటి సీనియర్ల వికెట్లు తీయడం విశేషం.

బంగ్లాదేశ్ తరపున ప్రపంచకప్ లో తొలి సెంచరీ చేసిన బ్యాట్స్ మన్ రికార్డు సృష్టించాడు మహ్మదుల్లా. వరుసగా రెండో సెంచరీ సాధించి తన ఫస్ట్ సెంచరీ గాలివాటం కాదని రుజువు చేశాడు. మొత్తం 344 పరుగులతో టాప్ బ్యాట్స్ మన్ల లిస్టులో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మదుల్లా కీలకం కానున్నాడు.

* జింబాబ్వే  ఆటగాళ్లు బ్రెండన్ టేలర్(433), సీన్ విలియమ్స్(339) పరుగుల వీరుల జాబితాలో టాప్ టెన్ లో స్థానం సంపాదించడం విశేషం.