పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయం
తాజా సాఫ్ట్‌వేర్‌తో తొలగిన ఇబ్బందులు
హైదరాబాద్,నవంబర్19(జనం సాక్షి): పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇక నుంచి శాశ్వత పరిష్కారం లభించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పెన్షనర్లు స్వాగతిస్తున్నారు. గతంలో ఎక్కడైతే పదవీ విరమణ చేశారో అక్కడే సవిూప బ్యాంకుకు వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి ఉండేది. ఇందుకోసం వేలి ముద్రలు వేయాల్సి వచ్చేది. రానురాను వారి వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించడం కోసం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ముఖ గుర్తింపు సాప్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఇప్పటికే రూపొందించినా దానికి తోడు టీయాప్ పోలియోను అందుబాటులోకి తెచ్చింది. ఈయాప్ వల్ల ప్రతి యేడా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యాప్ వల్ల ఉద్యోగి తన ఫొటోను యాప్ నుంచి ట్రెజరీ కార్యాలయానికి పంపితే పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో మేలు జరగనున్నది. పింఛన్‌దారులంతా ఏటా నవంబర్ 1నుంచి డిసెంబర్ 31లోను తాము జీవించే ఉన్నట్లు ధ్రువీకరిస్తూ జీవన ధ్రువీకరణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) ఖజానా శాఖ కార్యాలయంలో, బ్యాంకులోఅందజేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరిస్థి ఎలా ఉన్నా, తమ జీవన ధ్రువీకరణ పత్రాలను దాఖలు చేయడానికి వెళ్లలేని వారు, విూ సేవా కేంద్రాలకు వెళ్లి జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఆధారిత జీవన ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాన్ని ఆమోదిస్తేనే పింఛన్ అందుతుంది. ఇకపై సమయం వృథా కాకుండా సులభంగా జీవన ధ్రువీకరణపత్రం దాఖలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికేట్ లేకుండా పింఛన్ ఇచ్చే అవకాశం ఇవ్వడం తెలంగాణలోనే పప్రథమం. టీయాప్ ద్వారా నవంబర్ నుంచి పింఛన్ తీసుకునే అవకాశం తెలంగాణ సర్కార్ కల్పిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్‌దారుల సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారి కోసం కొత్త యాప్‌ను అందుబాటు లోకి తెచ్చింది. ఈవిధానాన్ని నవంబర్ 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నది. ఇందుకోసం ట్రెజరీ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లయితే ప్లే స్టోర్‌లో, ఐవోఎస్ వినియోగదారు లైతే యాప్ స్టోర్ నుంచి టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ వివరాల్లో పేర్లను నమోదు చేసుకోవాలి. వీటి ఆధారంగా మనకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లభిస్తాయి. వీటితో యాప్‌లోకి లాగిన్ అయి వార్షిక పరిశీలన ఆధారంగా రిజిస్టేష్రన్‌ను ఎంపిక చేసుకోవాలి. బ్యాంకు ఖాతా సంఖ్య, పింఛన్, ఐడీ, ఓటరు కార్డు ఎపిక్ సంఖ్య, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. అనంతరం సదరు పింఛన్‌దారుడు స్వీయ చిత్రం దిగి పంపించాలి. ఈచిత్రం జనాభా లెక్కలోను వివరాలతో సరిపోతే ఆమోదం పొందినట్లుగా మెసేజ్ వస్తుంది. ఈ వివరాలు ఖజానా శాఖ అధికారి బ్యాంకు అధికారికి చేరగానే జీవన ధ్రువీకరణపత్రం అందినట్టుగా భావిస్తారు. పింఛన్‌దారుడు ఎక్కడా ఉన్నా యాప్ నుంచి జీవన ధ్రువీకరణ పత్రం అందజేయవచ్చు.