పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యం

అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం
విజయవాడ,జూలై 23(జ‌నంసాక్షి): జిల్లాలో పింఛన్ల పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపంతోనే ఇదంతా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెలలో వైఎస్‌ఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయా తేదీల్లో పంపిణీ చేశారు. అయితే పింఛన్ల సొమ్ము పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పంపిణీ గడువు ముగిసినా కోట్లాది రూపాయల సొమ్ము పెండింగ్‌లో ఉండిపోయింది. మూడు నెలల వరకు పింఛన్‌ సొమ్ము పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అంటే ఒక పింఛన్‌దారుడు పలు కారణాలతో రెండు నెలలపాటు పింఛన్‌ సొమ్ము తీసుకునేందుకు రాలేకపోతే మూడోనెలలో ఒకేసారి మూడు నెలల పింఛన్‌ సొమ్ము తీసుకునే వెసులుబాటు కల్పించారు. అనారోగ్యం, ఇతర ప్రాంతాలకు పనులపై వెళ్లడం వంటి కారణాల వల్ల రెండు నెలలకోసారి పింఛన్‌ తీసుకునే పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎన్నడూ ఇంత సొమ్ము పెండింగ్‌లో లేదనే వాదనలు ఆ శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. పెండింగ్‌లోని సొమ్ము వచ్చేనెల సొమ్ముతో కలిపి ఇస్తామని డీఆర్‌డీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు ప్రాంతాల్లో సరైన సమయానికి సిబ్బంది హాజరురాకపోవడం వల్ల ఎక్కువమంది పింఛన్‌దారులు సొమ్ము తీసుకోలేకపోయారనే విమర్శలున్నాయి. గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చోలేక పింఛన్‌ సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే పలువురు వృద్ధులు పింఛన్‌ తీసుకోలేకపోయారని చెబుతున్నారు.