పెరిగిన పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు


న్యూదిల్లీ: పెట్రోల్‌ ధరలు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై ఒకటి నుంచి నేటివరకూ పెట్రోల్‌ ధర ఆరు రూపాయలు పెరగడం గమనార్హం. రోజువారీ పెట్రోల్‌ ధరల నిర్ణయ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత రూ.6 పెరగడం ద్వారా ధరలు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. మరోపక్క డీజిల్‌ ధర కూడా పెరిగింది. లీటర్‌కు రూ.3.67 పెరిగి దేశ రాజధాని దిల్లీలో లీటరు రూ.57.03కు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. ఆగస్టు 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.69.04(దిల్లీ) ఉండగా, నేడు రూ.70.33కు చేరింది.
గతంలో అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో పెట్రో ధరలను నిర్ణయించేవారు. అయితే ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు ఏరోజు ధరను ఆరోజు నిర్ణయించి విక్రయించడం ప్రారంభించాయి. జూన్‌ 16 నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ధరలు కొంతమేర తగ్గాయి. జూన్‌ 16న లీటర్‌ పెట్రోల్‌ ధర 65.48 ఉండగా, జులై 2 నాటికి రూ.63.06కు తగ్గింది. ఇక అక్కడి నుంచి ధరలు పెరుగుతూ వచ్చాయి. అదే సమయంలో జూన్‌ 16న డీజిల్‌ ధర రూ.54.49 ఉండగా, జులై 2 నాటికి రూ.53.36 తగ్గి, అప్పటినుంచి పెరుగుతూ వస్తున్నాయి.