పెళ్లివేడుకల బృందంపై విద్యుత్‌ పంజా

ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 14 మంది దుర్మరణం

రాజస్థాన్‌లో గోర ప్రమాదం

జైపూర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో రాజధాని జైపూర్‌ సవిూపంలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలతో వెళుతున్న బృందం విద్యుద్ఘాతానికి గురయ్యింది. ఈ ఘటనలో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 14 మంది మృతి చెందారు. షాపురా టౌన్‌లోని ఖతులాయ్‌ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పెళ్లి బృందం వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి, జైపూర్‌ రూరల్‌ ఎంపీ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే దిగ్భత్రి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం ప్రకటించారు.