” పేదరికం విద్యార్థులకు శాపం కాకూడదు – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 21( జనంసాక్షి): పేదరికం, కటిక దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థికి శాపంగామారి విద్యకు దూరం కాకూడదని, ఇది సమాజానికి ఎంతో చేటు చేస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ మేరకు డివిజన్ పరిధి లింగంపల్లి విలేజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రైల్వే బ్రిడ్జి సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో బుధవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 300 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో నెలవారి బస్సు పాసులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాల లాగా పేదరికంలో సైతం ఎంతో ప్రతిభకలిగిన విద్యార్థులు ఉంటారని, అలాంటివారు ఆర్థిక కారణాలతో సర్కారు విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో తనకు తోచిన చిన్నపాటి సహకారాన్ని విద్యార్థులకు అందించడం జరిగిందన్నారు. గతంలోని మేధావులంతా ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వారేనని, అందుకే ప్రభుత్వ విద్య పట్ల తానెల్లప్పుడు ఆసక్తితో ఉంటానన్నారు. విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తమలాంటి నిరుపేద విద్యార్థులకు హితోదికంగా సాయం అందించాలని రాగం ఆశాభావం వ్యక్తంచేశారు. విద్యార్థులు తమను కనిపించిన తల్లిదండ్రులను, విద్యను బోధించిన ఉపాధ్యాయులను, ఆపద సమయంలో ఆదుకున్న వారిని జీవితంలో ఎప్పటికీ మరువకూడదని, కృతజ్ఞతగా ఈ సమాజ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని రాగం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, సహచర ఉపాధ్యాయులు, వార్డ్ మెంబర్ శ్రీకళ, బసవరాజు లింగాయత్, గోపాల్ యాదవ్, హెచ్.సి.యు ఆర్.టి.సి బస్ డిపో డి.ఎం శ్రీనివాస్, సి.ఐ రామయ్య, ఏ.డి.సి సురేందర్, బాబురావు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.