పేదలకు న్యాయం జరిగినప్పుడే అంబేడ్కర్ ఆశయం నెరవేరుతుంది
` రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా,102 సవరణలు చేసినా నేటికి అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి
` జస్టిస్ చంద్రు
హైదరాబాద్,డిసెంబరు 18(జనంసాక్షి): రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా… 102 సవరణలు చేసినా, నేటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ చంద్రు అన్నారు. పేదలకు, నిరాదరణకు గురవుతున్న వాళ్లకు తగిన న్యాయం జరిగినప్పుడే అంబేడ్కర్ ఆశయం నెరవేరుతుందని ఆయన అన్నారు. ఉస్మానియ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగం, పౌర హక్కులు, సామాజిక న్యాయం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. తాను చదువుకునే రోజుల్లో గిరిజనులు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని స్థితిలో ఉండే వాళ్లని, అగ్రకులాలు, పోలీసులు కలిసి కొన్ని గిరిజన జాతులను దొంగలుగా ముద్ర వేశారని తెలిపారు. గిరిజన తెగలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం ఆధారంగానే జై భీమ్ సినిమా విడుదలై ఎంతో ప్రాచుర్యం పొందిందని జస్టిస్ చంద్రు చెప్పారు. రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదని, పోరాటాల ద్వారా సమస్యలకు పరిష్కారం సాధించుకోవాలన్నారు.