పైవంతెన కూలిన ఘటనలో 27కు చేరిన మృతుల సంఖ్య

5కోల్‌కతా : పశ్చిమ్‌బంగా రాజధాని నగరం కోల్‌కతాలో ఫ్లైఓవర్‌ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 27కి పెరిగింది. శనివారం శిథిలాల కింది నుంచి మరో మూడు మృత దేహాల్ని వెలికి తీశామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఓపీ సింగ్‌ తెలిపారు. గురువారం ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఫ్లైఓవర్‌ని ఐవీఆర్‌సీఎల్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శుక్రవారం ఈ సంస్థకు చెందిన 10 మంది అధికారుల్ని అదుపులోకి తీసుకుని విచారించామని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 302, 307, 120బీల కింద… సంస్థ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మల్లికార్జున్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ దేబ్‌జ్యోతి మజుందార్‌, స్ట్రక్చర్‌ మేనేజర్‌ ప్రదీప్‌ కుమార్‌ సాహాలను అరెస్టు చేసినట్లు కోల్‌కతాకు చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు.