పొంగులేటి నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు  


హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు  కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న రాఘవా ప్రైడ్‌ ఆఫీస్‌తోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 17లో ఉన్న ఇండ్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంట్లో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన కుటుంబ సభ్యుల నుంచి పలు వివరాలు సేకరించారు. గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, లాంకోహిల్స్‌, రాయదుర్గం, బషీర్‌బాగ్‌ ప్రాంతాలతోపాటు ఖమ్మం టౌన్‌, ఖమ్మం రూరల్‌, పాలేరు, స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో పొంగులేటికి చెందిన కంపెనీలు, బంధువుల ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలోని ఏ ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోనివ్వని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మొదటి నుంచి బీరాలు పలుకుతున్నారు. తన డబ్బుతోపాటు టికెట్లు అమ్ముకొని పీసీసీ అధ్యక్షుడు అక్రమంగా సంపాదించిన డబ్బును కూడా ఉమ్మడి ఖమ్మంలో భారీగా పంచుతున్నట్టు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ వైపు గాలి వీస్తుండటంతో డబ్బులు పంచి గెలువాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఖమ్మం చేరుకున్న డబ్బులో పీసీసీ అధ్యక్షుడి సోదరుల పాత్ర ఉన్నట్టు టికెట్లు ఆశించి భంగపడిన బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు. ఐటీ సిబ్బందిలోని కొందరు కోవర్టుల ద్వారా సోదాల విషయాన్ని ముందుగానే తెలుసుకున్న పొంగులేటి.. అప్రమత్తమైనట్టు తెలిసింది. అక్రమంగా సంపాదించిన డబ్బు తనిఖీల్లో పట్టుబడకుండా ముందే సర్దేసినట్టు తెలుస్తున్నది. అక్రమ డబ్బునంతా తరలించిన తర్వాత.. తనపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతాయని సభల్లో చెప్పాడని, అతను చెప్పిన 17 గంటల్లోపే ఐటీ సోదాలు జరిగాయని, ఇదంతా ఆయన స్క్రిప్ట్‌ ప్రకారమే జరిగిందని ఖమ్మానికి చెందిన కొందరు నేతలు చెప్తున్నారు.