పొంచివున్న ప్రమాదం-పట్టించుకొని అధికారులు
ఖమ్మం, జూలై 28: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా వెంకటాపురంలోని ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్రమాదం పొంచివుందనే భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెంకటాపురం మండలంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకునేందుకు వాజేడు మండలంలోని అనేక గ్రామాల నుంచి విద్యార్థులు వెళ్లుతున్నారు. మొదట్లో బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులను పాఠశాలకు తరలించిన యాజమాన్యం ఈ ఏడాది ఆటో ద్వారా 20 కిలోమీటర్ల దూరం తీసుకెళుతున్నారు. ఒకవైపు ఆటో ప్రయాణం, మరోక వైపు ఆస్తవ్యస్థంగా ఉన్న రహదారి మూలంగా ఏ క్షణం ఏం జరుగుతుందోనని విద్యార్థులు వణికిపోతున్నారు. అయితే గత్యంతరం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అదే పాఠశాలకు పంపిస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో ప్రమాదపు సంఘటనలు జరిగే ఉన్నతాధికారులు పలు హెచ్చరికలు చేసినప్పటికీ మారుమూల మండలంలోని విద్యార్థుల చదువు పట్ల మండల స్థాయి అధికారులు దృష్టి సారించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.