పొడిదుక్కిలో తొందరపడి విత్తనాలు నాటొద్దు – చేర్యాల మండల వ్యవసాయ అధికారి అఫ్రోజ్
చేర్యాల (జనంసాక్షి) జూన్ 14 : వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వర్షం పడలేనందున పొడిదుక్కిలో విత్తనాలు నాటొద్దని చేర్యాల మండల వ్యవసాయ అధికారి ఎండీ. అఫ్రోజ్ తెలిపారు. రైతులు తొందరపడి పత్తి విత్తనాలు పెడుతున్నారని, వర్ష పాతం తక్కువగా ఉన్న కారణంగా అవి మొలకెత్తవని, వర్షాకాలం సాగుకు సన్నద్ధం కావాలంటే సుమారు 60 మి.మీ నుంచి 70 మి.మీ వర్షం పడినప్పుడు మాత్రమే భూమి చల్లబడుతుందని, అప్పటి వరకు రైతులు పొడి దుక్కిలో విత్తనాలు నాటరాదన్నారు. తొందరపడి విత్తనాలు పెట్టినా 4 నుంచి 5 రోజుల్లో వర్షం పడకపోతే భూమిలో ఉన్న పత్తి గింజలను మట్టిపురుగులు, పెంకు పురుగులు తింటాయని,రైతులు అర్ధం చేసుకొని పొడి దుక్కిలో విత్తనాలు నాటవద్దన్నారు. రైతులు నష్టపోకుండ తగు జాగ్రత్తలు, సలహాలు తీసుకోవాలని రైతులకు సూచించారు.