పొరుగురాష్ట్రాలతో స్నేహపూర్వక వైఖరి
– విజయవాడలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పంపకాల సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్,సెప్టెంబర్ 14,(జనంసాక్షి):ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే తెలంగాణ మౌలిక విధానానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో విభజన సమస్యలను విజ్ఞతతో పరిష్కరించుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకానికి సంబంధించి శుక్రవారం విజయవాడలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో తెలంగాణ వైఖరిని ఖరారు చేయడానికి గురువారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పి.మహేందర్ రెడ్డి, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణరావు, సునిల్ శర్మ, టిఎస్‌ఆర్టీసీ ఎండి రమణారావు తదితరులు పాల్గొన్నారు.’దేశంలో ఇతర రాష్ట్రాలు విడిపోయి కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏ నిబంధనలు అమలు చేశారో, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కూడా అవే పాటించారు. ఏమైనా సమస్యలు తలెత్తితేరాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి. అలా సాధ్యం కాని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది. అయినా వివాదం పరిష్కారం కాకుంటే ఏం చేయాలనే విషయంలో కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు చేసిన విభజన చట్టం మేరకే ఏ వివాదమైనా పరిష్కారం కావాలి. ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఒక వాస్తవం. ముందు ఈ వాస్తవాన్ని అంతా అంగీకరించాలి. విజ్ఞతతో ఎవరి పాలన వారు చేసుకోవాలి. ఎవరి సంస్థలు వారు నడుపుకోవాలి. తెలంగాణ రాష్ట్రం విభజన నేపథ్యంలోనే ఎపిఎస్‌ఆర్టిసి విభజన కూడా జరుగుతుంది. రాష్ట్ర విభజనకు వర్తించిన నిబంధనలే ఆర్టీసీ విభజనకు వర్తిస్తాయి. పార్లమెంటు చేసిన చట్టానికి లోబడే పంపకాలు జరుగుతాయి. ఇందులో బోర్డు చేతిలో ఎలాంటి అధికారం లేదు” అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే వైఖరిని విజయవాడలో జరిగే సమావేశంలో వెల్లడించాలని అధికారులకు సూచించారు.